Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవవంగాణ -బెంగళూరు
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త ఉద్యోగుల పై వేటు వేసింది. శిక్షణ అనంతరం ఉద్యోగంలో సరైన పనితీరు కనబరచని కారణంగా వీరిని తొలగించినట్లు తెలిపింది. కంపెనీ ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించే ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని 600 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది.
కొద్ది నెలల క్రితం ఇన్ఫోసిస్ కంపెనీ ఎఫ్ఏ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు కంపెనీ అంతర్గంగా తెలిపింది. ఫ్రెషర్స్ తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలని సూచించింది. పరీక్ష ఫలితాల ఆధారంగా రెండు వారాల క్రితం 600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించినట్లు కంపెనీ ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు తెలిపారు. వీరంతా 8 నెలల క్రితం ఆఫర్ లెటర్ తీసుకున్నవారే కావడం గమనార్హం. మరోవైపు కంపెనీ జాబ్ ఆఫర్ అందుకుని, ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారు సైతం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.