Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఆపదలో చిక్కుకున్న టర్కీకి భారత దేశం తక్షణం ఆపన్న హస్తం అందజేసింది. సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అవి భారత వైమానిక దళ విమానంలో బయల్దేరాయి. నిపుణులైన జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు, అత్యంత నైపుణ్యంగల జాగిలాల స్క్వాడ్స్, ఔషధాలు, అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్, సహాయక చర్యలకు అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు వీటిలో ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందంలో మహిళలు కూడా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మంగళవారం ఇచ్చిన ట్వీట్లో, భారత దేశ మానవతావాద సహాయ, విపత్తు ఉపశమన శక్తి, సామర్థ్యాలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. భూకంప బాధితులకు అందజేసే సహాయంలో మొదటి విడత సహాయక మెటీరియల్ తుర్కియేకు బయల్దేరినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్, రెస్క్యూ టీమ్స్, స్పెషల్లీ ట్రైన్డ్ డాగ్ స్క్వాడ్స్, మెడికల్ సప్లయ్స్, డ్రిల్లింగ్ మెషిన్స్, ఇతర అవసరమైన పరికరాలు వీటిలో ఉన్నట్లు తెలిపారు. ఘజియాబాద్‌లోని హిండోన్ వైమానిక స్థావరం నుంచి ఈ సహాయక బృందాలు బయల్దేరాయి. మూడు భూకంపాల వల్ల టర్కీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.