Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవతులంగాఫ - టర్కీ
తుర్కియేలో నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడంలేదు. రిక్టర్ స్కేల్‌పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. తొలుత భారీ భూకంపం వచ్చిన తర్వాత చిన్నచిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా 5.0-6.0 తీవ్రతతో మరికొంతకాలం పాటు ఈ ప్రకంపనలు రావొచ్చని వారు పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే దెబ్బతిన్న భవనాలు కూలవచ్చని తెలిపారు. దీంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మధ్యదరా సముద్రంలో ఉన్న తుర్కియే కీలక నగరం ఇసికందరన్‌లోని లిమాక్ పోర్టు భూకంపం దెబ్బకు తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ కంటైనర్లను ఉంచిన ప్రదేశంలో భారీగా అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. తుర్కియేలోని విద్యుత్తు వ్యవస్థ, సహజ వాయు పైపు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ రంగ పైపులైన్ ఆపరేటర్ బోటాస్ దీనిపై కీలక ప్రకటన చేసింది. గాజాయాంటెప్, హటే, కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లకు పైపు లైన్లో గ్యాస్ సరఫరాలను ఆపివేసినట్లు పేర్కొంది. కహ్రామన్మరాస్లోని పైపులైను భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో ఆస్పత్రులకు, ఆహారశాలలకు, గ్యాస్ సరఫరా వ్యవస్థలకు విద్యుత్తును అందించేందుకు అత్యవసర చర్యలను చేపట్టింది. తమ మొబైల్ విద్యుత్తు ప్లాంట్లను ఆయా ప్రదేశాలకు పంపినట్లు టర్కీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పేర్కొంది. అక్కుయు అణు విద్యుత్తు కేంద్రానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం వెల్లడించింది.