Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొత్త ఏడాది రోజు దేశరాజధాని ఢిల్లీలోని కాంజావాల్ ప్రాంతంలో ఓ యువతిని కారు మూడు కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే 20 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ భయంకరమైన ఘటన మరువకముందే ఇలాంటి తరహాలోనే ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందిన వీరేంద్ర సింగ్ అనే వ్యక్తి.. ఆగ్రా నుంచి నోయిడాకు కారులో బయలు దేరాడు. ఆ సమయంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టి.. దాదాపు పది కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లాడు. మథుర ఎక్స్ప్రెస్ వేపై టోల్బూత్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దట్టమైన పొగ మంచు కారణంగా వ్యక్తిని ఢీ కొట్టిన విషయం తనకు తెలియలేదని, కారు కింద ఇరుక్కున్నట్లు కూడా గమనించలేదని నిందితుడు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. ఈ ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.