Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి అధికారుల అపాయింట్మెంట్ దొరగ్గానే ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. తాజాగా నెల్లూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించినందుకు తనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తున్నాయన్న ఆయన..అన్నింటికీ తెగించిన వారే తన వెంట ఉన్నారని వ్యాఖ్యానించారు. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్న కోటంరెడ్డి.. రాజ్యాంగబద్ధ మార్గాల్లో ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్లు, వాటర్ వర్క్స్‌పై మాట్లాడితే తప్పేంటని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. తన ఆరోపణలకు సరైన రీతిలో స్పందించాలని హితవు పలికారు. పనులు పూర్తి చేసేందుకు కేవలం 10 కోట్ల రూపాయల నిధులు సరిపోతాయన్నారు. కాంట్రాక్టర్ పనులు ఆపేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు సమస్యను సీఎంకు నేరుగా చూపించానని కూడా కోటంరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, రోడ్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జిల్లా కలెక్టరేట్, 25న ఆర్అండ్బీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ప్రకటించారు.