Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరైంది. తన ఆశ్రమంలో 11 ఏండ్లపాటు గడిపిన ఓ మహిళ తనపై స్వామి చిన్మయానంద లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించింది. తాను తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని, రెండుసార్లు తనకు అబార్షన్ చేయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. దాంతో ఆయనపై 2011 లో లైంగికదాడి కేసు నమోదైంది.
దీంతో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీఆర్పీసీ సెక్షన్ 321 కింద దరఖాస్తు దాఖలు చేశారని స్వామి చిన్మయానంద తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చిన్మయానందపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్లో ఫిర్యాదుదారు పేర్కొన్న తర్వాత జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ ధ్రువీకరించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ తరుణంలో అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇస్తున్నట్లు ధ్రువీకరించింది. స్వామి చిన్మయానందపై కేసును ఉపసంహరించుకునేందుకు అభ్యంతరం లేదని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల్లోగా ప్రత్యుత్తరాలు దాఖలు చేయాలని ఫిర్యాదుదారుతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.