Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుర్కియే
తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.8 నమోదైంది. అనంతరం కొన్ని గంటల్లోనే 7.6, 6.0 తీవ్రతతో మరో రెండు భారీ భూకంపాలు తుర్కియే, సిరియా దేశాలను వణికించాయి. మంగళవారం సైతం రెండు సార్లు 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప విలయంలో ఇప్పటి వరకు రెండు దేశాల్లో కలిపి 9,500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 30వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంచనా వేసింది.
ఈ తరుణంలో బుధవారం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. గాజియాంటెప్ ప్రావిన్స్ లోని నూర్దగి జిల్లాలో బుధవారం ఉదయం 8:31గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో మొదటిసారి భూమి కంపించగా ఈ క్రమం నుండి ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ ఘోర విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రకంపనల ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద 1,80,000 మంది చిక్కుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులుగా 25 వేల మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.