Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 11వ తేదీన ఫార్ములా ఈ-రేసింగ్ జరగనున్న తరుణంలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌తోపాటు ఇతర మార్గాలను మూసి వేయడంతో కేవలం అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి దాదాపు గంట సమయం పడుతోంది. ప్రధానంగా కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తోంది. ఖైరతాబాద్ ప్రాంతంలో బస్తీల నుంచి ఖైరతాబాద్ ప్రధాన రహదారికి వెళ్లాలంటే రైల్వే గేటు ఉంది. ఈ గేటు సమీపంలో నివాసం ఉండే వారు మింట్‌కాంపౌండ్, నెక్లెస్ రోటరీ, ఫ్లైఓవర్ మీదుగా తిరిగి వెళ్తుంటారు.
మింట్‌కాంపౌండ్ దారిని సచివాలయం కోసం రోడ్డు వేస్తూ కొద్ది రోజులుగా పూర్తిగా మూసేశారు. ఐమ్యాక్స్ దారి కూడా మూతపడడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడితే తమకు నరకమేనని బస్తీవాసులు వాపోతున్నారు. పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ మీదుగా అబిడ్స్ వెళ్లేందుకు సాధారణంగా పావుగంట సమయం పడుతుంది. ఖైరతాబాద్ ట్రాఫిక్ ప్రభావం మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాలపైనా పడింది. రేతిబౌలి నుంచి సోమాజిగూడ వరకు వెళ్లడానికి ఏకంగా గంటన్నర సమయం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి లక్డీకాపూల్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.