Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ తరుణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వాటిని నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేందుకు ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్స్కు, ఇన్నోవేటివ్ ఆలోచనలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం టీహబ్తోపాటు అనేక కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. పోటీ ప్రపంచంలో టెక్నాలజీతో పాటు విజ్ఙానాన్ని అప్డేట్ చేసుకోవడంతో పాటు కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించకపోతే 20ఏళ్లు వెనక్కి వెళ్తామని, విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మహ్మద్ వలీవుల్లా, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, తదితరులు పాల్గొన్నారు.