Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అంకారా
ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తుకు తుర్కియే, సిరియా దు:ఖంతో తన్నుకులాడుతుంది. ఎటు చూసినా శిథిలాల గుట్టలు శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. నిమిష నిమిషానికి వందలాది మృతదేహాలు బయటపడుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ భూకంప మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ అంతులేని విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ భూప్రళయం కారణంగా ఇరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది.
సోమవారం నాటి భూకంపం కారణంగా ఒక్క తుర్కియేలోనే 12,391 మంది మరణించగా సిరియాలో 2,992 మంది ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15,383కు పెరిగింది. శిథిలాల కింద ఇంకా లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారి సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బలగాలు కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.