Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: అనారోగ్యంతో చనిపోయిన భార్య మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక ఒక వ్యక్తి తన భుజంపై కొంతదూరం మోశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించి అతడికి సహాయం చేశారు. సొంత డబ్బుతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన ఈడే సాములు భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్చాడు. అయితే చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
కాగా, సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని సోరాడ గ్రామానికి భార్యను తీసుకెళ్లేందుకు సాములు రెండు వేలకు ఆటో మాట్లాడుకున్నాడు. అయితే విజయనగరం చేరుకునేసరికి అతడి భార్య ఆటోలోనే మరణించింది. దీంతో సాములతోపాటు అతడి భార్య మృతదేహాన్ని వారి గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో సాములు తన భార్య మృతదేహాన్ని కొంతదూరం భుజంపై మోశాడు. మరోవైపు రోడ్డుపై వెళ్లే వారు దీనిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. సీఐ తిరుపతిరావు, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు కలిసి పదివేలు సమకూర్చి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో చనిపోయిన భార్య మృతదేహాన్ని సాములు తన గ్రామానికి తీసుకెళ్లాడు.