Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ పాషా
నవతెలంగాణ వెంకటాపురం
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గురువారం చిట్టెం ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్ పాషా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... 2023-24 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.26,831 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ వ్యవసాయానికి రూ.20,890 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఆర్థిక మంత్రి చెప్పిన పద్దు పరిశీలించిన అందులో రైతుల రుణ మాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించారని తెలిపారు.లక్ష రూపాయలలోపు రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామి ఇచ్చారు. కానీ ఈ నిధులతో రైతుల రుణాలు మాఫీ జరగలేదు అన్నారు.
ఇప్పటికే జిల్లాలో రైతులు డిఫాల్టర్లుగా మారారు అనివివరించారు. ఏకకాలంలో రుణమాఫీ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుబంధుకు రూ.15,075 కోట్లు, రైతుబీమాకు రూ.1,589 కోట్లు కేటాయింపు చూపారన్నారు.ఈ 3 పద్దుల మొత్తం రూ. 23,049 కోట్లకు చేరుకుంది. ఇక మిగిలింది రూ.3,332 కోట్లు మాత్రమే అన్నారు.ఈ బడ్జెట్లో పరిశోధనలకుగాని, ప్రకృతివైపరీత్యాల పరిహారం చెల్లింపుకుగాని, హార్టికల్చర్ అభివృద్దికిగాని పెద్దగా కేటాయింపులు లేవన్నారు.అయిల్ ఫామ్ తోటల పేంపుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి లక్షల ఎకరాలలో వేయిస్తామని, రైతులకు 50 శాతం నుండి 90 శాతం రాయితీ ఇస్తామని ప్రకటన చేసి దానికి తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు.
ఈ సంవత్సరం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 171.20 లక్షల కాగా, వాస్తవంగా సాగైంది 194.86 లక్షల ఎకరాలు కాగా ఇందులో 82 శాతం సన్నచిన్నకారు రైతులున్నారని వివరించారు.రైతు బంధు, రైతుబీమా మినహాయిస్తే మిగిలిన అంశాలకు కేటాయింపులు లేవన్నారు. రైతు బీమాను 18-59 నుండి 18-70 సంవత్సరాలకు వరకు పెంచాలని రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి. కౌలు రైతులకు ఏ పథకం ప్రకటించలేదని ఎద్దేవాచేశారు.ఈ బడ్జెట్లో ఆ ప్రతిపాధనలు లేవు. ప్రకృతి వైపరీత్యాల పరిహారాన్ని పూర్తిగా మినహాయించారు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు మిర్చి పంటకు తామర పురుగులతో ఇలా అన్ని రకాల పంటలు దిగుబడులు తగ్గి అనేక నష్టాల పాలవుతున్నారు రైతులు. కోతులు, పందులు, ఎలుకలు, అడవీ జంతువుల బెడద వలన లక్షలాది ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయన్నారు.
వీటి నివారణకు బడ్జెట్ కేటాయింపులులేవు. అటవీశాఖ నిర్లిప్తంగా ఉంది. మార్కెట్ జోక్యం పథకానికి, తక్కువ ధరలకు అమ్మినప్పుడు రైతులకు బోనస్ చెల్లించడంపై కేటాయింపులు ఏవి అన్నారు.ప్రస్తుతం వ్యవసాయ పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కల్తీ, నాణ్యతలేని విత్తనాల వలన ఏటా 4, 5 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయని వివరించారు.
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలన్నారు. పై పరిస్థితుల దృష్టా వ్యవసాయ బడ్జెట్ను రెట్టింపు చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు సామ చంద్రారెడ్డి, కంటెం సత్యం, జిల్లా కమిటీ సభ్యులు భోగ ట విజయ్ కుమార్, తోట నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.