Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ కేసులో గుజరాత్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. మోడీ ఎంఏ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని అరవింద్ కేజ్రీవాల్‌కు అందించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ యూనివర్సిటీ (జీయూ) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది పెర్సీ కవీనా తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు హైకోర్టు ధర్మాసనం గురువారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివరాలను బహిరంగపరచాలని సీఐసీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ అంశంపై ఉన్న అన్ని రకాల గందరగోళాలను తొలగించేందుకు డిగ్రీని పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురావాలని కేజ్రీవాల్ లేఖలో సూచించారు. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు కొనసాగిస్తూ.. ఇందులో దాపరికం ఏమీ లేదన్నారు. యూనివర్శిటీ డిగ్రీలు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ, ఆర్టీఐ కింద కాపీ కావాలని మూడో వ్యక్తి బలవంతం చేయలేరన్నారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది పెర్సీ కవీనా వాదనలు వినిపిస్తూ.. పీఎంఓ కార్యాలయంలోని పీఐఓకు ఆదేశాలు జారీ చేసినప్పుడు గుజరాత్ యూనివర్శిటీ కోర్టును ఎందుకు ఆశ్రయించిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి విద్యార్హతలను వెల్లడించడం చట్టం ప్రకారం తప్పనిసరి అని కూడా కవీనా పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ప్రకటించింది.