Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం రేపుతుంది. యాసంగి వరి నాటు వేసేందుకు వెళ్లిన మహిళా కూలీలు బురద కడుక్కునేందుకు వెళ్లగా ఒక్కసారిగా మొసలి కనిపించడంతో ఒడ్డుకు పరుగులు తీశారు. మైలారం, కొత్తపల్లి, పొగుళ్లపల్లి, గుండంపల్లి ప్రాంతాల నుంచి వర్షకాలంలో వరద నీటికి పాకాల చెరువు నుంచి పెద్ద చెరువులోకి మొసలి వచ్చి ఉంటుందని పలువురు వాపోతున్నారు. కాగా పాకాల సరస్సులో సుమారు 500 వరకు మొసళ్లు ఉండవచ్చని సమాచారం ఉందని పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం వేళలో ఒడ్డుకు మొసళ్లు వస్తుండటంతో గ్రామస్థులు, ఆయకట్టు రైతులు భయాందోళనలో ఉన్నారు.