Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ప్రజలకు ఉపాధి కల్పించే రంగం చేనేత అని మంత్రి కేటీఆర్ అన్నారు. బడ్జెట్ పద్దుపై చర్చలో భాగంగా చేనేత రంగం, కార్మికులపై పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ తరుణంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి రూ.70 కోట్లు కేటాయించింది.
ఇవాళ తెలంగాణ సర్కార్ ఈ రంగానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడమే కాకుండా చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. అయితే, ప్రధాని నరేంద్రమోడీ ఎందుకో ఈ రంగంపై కత్తిగట్టినట్టు అనిపిస్తోంది. ఈ 8 ఏళ్లలో చేనేత రంగంపై మోడీ ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రధాన మంత్రుల్లో ఎవరూ చేయని ఒక ఆలోచన మోడీ చేశారు. చేనేత ఉత్పత్తులపైన 5 శాతం పన్ను విధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని ఎన్ని ఉత్తరాలు రాసినా ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. 5 శాతం ఉన్న పన్నును 12శాతానికి పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.