Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎయిర్ ఇండియా సంస్థ కొత్తగా సుమారు 500 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆ సంస్థ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దాదాపు 100 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆ ఒప్పందంపై త్వరలో ఓ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్, ప్రత్యర్ధి సంస్థ బోయింగ్ నుంచి కూడా ఎయిర్ ఇండియా కొత్త విమానాలను ఖరీదు చేయనున్నది. అయితే వచ్చే వారం ఈ డీల్ గురించి ప్రకటన అధికారికంగా వెలుబడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 250 ఎయిర్‌బస్ విమానాలను ఎయిర్ ఇండియా ఖరీదు చేయాలని భావిస్తోంది. దాంట్లో 210 ఏ320, 40 ఏ350 విమానాలు ఉండనున్నాయి. ఇక బోయింగ్ నుంచి 190 737 మ్యాక్స్, 787కు చెందిన 20 విమానాలను కొనుగోలు చేయనున్నారు. వీటి తోడు 777ఎక్స్ వెరైటీకి చెందిన మరో పది బోయింగ్ విమానాలను కూడా ఖరీదు చేయనున్నారు. ఎయిర్‌బస్, ఎయిర్ ఇండియా సంస్థలు తమ ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేశాయి. దీనిపై కామెంట్ చేసేందుకు ఎయిర్‌బస్ నిరాకరించింది. బోయింగ్ సంస్థతో కూడా త్వరలో ఒప్పందం కుదురనున్నది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాను టాటా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో కొత్త విమానాల కోసం చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు జనవరి 27వ తేదీన ఆ సంస్థ తన ఉద్యోగులకు ఓ నోట్ జారీ చేసింది.