Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఇద్దరి సామాజిక వర్గాలు వేరు అయినా ప్రేమించుకుని పెండ్లి చేసుకున్నారు. ఏడేండ్లు వాళ్ల కాపురం సజావుగానే సాగింది. గతేడాదిగా భార్య ప్రవర్తనపై అనుమానం, కక్ష పెంచుకున్న భర్త ఆమెను కత్తితో పొడిచి కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలమేరకు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన షేక్ నాగుల్‌మీరా (బాజీ) మొదటి భార్యతో విడిపోయి తన సోదరి ఊరైన రమణక్కపేటకు వచ్చి ఉంటున్నాడు. తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గొల్లపల్లి జ్యోత్స్న(29)తో పరిచయమేర్పడింది. ఇద్దరూ 2015లో ముస్లిం సంప్రదాయం ప్రకారం మతాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. జ్యోత్స్న కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి సహాయపడేది. కానీ, ఏడాదిగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో భార్య ఫోన్‌ను తిరువూరు తీసుకెళ్లి ఆమె నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఈ అమ్మాయి రేటు ఇంత అంటూ పోస్టు పెట్టాడు. ఏమీ తెలియనట్టు రమణక్కపేటకు వచ్చి సెల్‌ఫోన్‌ను జ్యోత్స్న తల్లికి ఇచ్చి వెళ్లాడు. ఆగంతుకుల ఫోన్లు రావడంతో గత అక్టోబరులో బాధిత కుటుంబం ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నాగుల్‌మీరా అదృశ్యమయ్యాడు. జ్యోత్స్నపై అనుమానంతోపాటు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గరువారం రాత్రి జ్యోత్స్న ఇంటికి వచ్చి చెట్టు చాటున దాక్కున్నాడు. అటుగా వస్తున్న భార్యపై కత్తితో మూడు సార్లు పొడిచి పరారయ్యాడు. ఆ సమయంలో చిన్న కుమారుడు చూసి బంధువుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. వారు పరుగెత్తుకు వచ్చి చూసేసరికి జ్యోత్స్న చనిపోయింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.