Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తుర్కియే భూకంప దాటికి మృతిచెందిన వారి సంఖ్య 25 వేలు దాటింది. ఐదురోజుల తరువాత కూడా ప్రాణాలతో బయటపడ్డ ఘటనలు కూడా చాలా వెలుగులోకి వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ 13 ఏండ్ల బాలుడ్ని రెస్క్యూ టీమ్ రక్షించింది. అయితే అతని చేతుల్లో పెంపుడు చిలుక ఉంది. సుమారు 5రోజుల పాటు శిథిలాల కిందే ఆ చిన్నారి చిలుకను పట్టుకుని ఉన్నాడు.
ఖరామన్మరాస్లో ఓ కూలిన అపార్ట్మెంట్ వద్ద అరుపులు వినిపించాయి. దీంతో రెస్క్యూ టీమ్ అక్కడ మూడు గంటల పాటు సెర్చ్ చేసింది. ఆ తర్వాత బీరట్ సారి అనే కుర్రాడు రెస్క్యూ టీమ్‌కు చిక్కాడు. ఇక అతను తన చేతుల్లో ఓ చిలుకను సజీవంగా పట్టుకుని ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెస్క్యూ టీమ్ అతన్ని గుర్తించన సమయంలో.. ఆ కుర్రాడు తన ఆంటీ కోసం వెతికాడు. ఆ చిలుకను ఆమెకు అప్పగించిన తర్వాత అంబులెన్స్ ఎక్కాడు. ఆ చిలుకకు ఆమె నీళ్లు, దాణా పెట్టింది. ప్రస్తుతం బీరట్‌కు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి, చిలుక బ్రతికి ఉన్నారని తెలుసుకుని ఆ మహిళ సంతోషాన్ని వ్యక్తం చేసింది.