Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ప్రయివేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ తీసుకొచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దుబ్బాకకు డయాలసిస్ సెంటర్ కేటాయించామని తొందరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అసలు పేద ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే కార్పొరేట్ సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆ ఉద్దేశంతోనే జిల్లాకో మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీ వస్తే ప్రొఫెసర్లు వస్తారని.. 650 పడకల ఆస్పత్రి వస్తుందని.. ఆపరేషన్ థియేటర్లు వస్తాయని అన్నారు. దీనిద్వారా పేద ప్రజలకు వాళ్ల జిల్లాలోనే కార్పొరేట్ వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎల్బీనగర్, ఎర్రగడ్డ, ఆల్వాల్, గచ్చిబౌలిలో 4200 పడకలతో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను.. నిమ్స్‌లో 2వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను.. వరంగల్‌లో 1100 కోట్లతో 2వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. అంటే దాదాపు 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకున్నామని వివరించారు. ఈ 10 వేల పడకలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కార్పొరేట్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు. పేదలు ప్రయివేటు ఆస్పత్రులు వెళ్లి అప్పుల బారిన పడకూడదనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ఉచితంగా వైద్యసేవలు అందాలనే హైదరాబాద్ నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. ఉచితంగా వైద్య సేవలు అందాలనే వరంగల్‌లో హెల్త్ సిటీలు తీసుకొస్తున్నామని చెప్పారు.