Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ హైదరాబాద్: రామగుండం మెడికల్ కాలేజీలో ఆడ్మిషన్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అలాగే ఆ ఆస్పత్రికి సింగరేణి అని పేరు పెడతామని.. సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్నరాల సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అడిగిన ప్రశ్నకు హరీశ్ రావు ఈ మేరకు సమాధానమిచ్చారు.
సింగరేణి సౌజన్యంతో రామగుండంలో మెడికల్ కాలేజీ కడుతున్నారు కాబట్టి సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డులు పెట్టాలని.. వాళ్ల పిల్లలకు ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని.. సింగరేణి మెడికల్ కాలేజీగా పేరు పెట్టాలని కోరుకంటి చందర్ అడిగారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. శాసన సభ్యులు అడిగిన మూడు పనులకు త్వరలో ఉత్తర్వులు ఇస్తామని ఆయన ప్రకటించారు. సింగరేణి కార్మికులు అంటే సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ అని ఈ సందర్భంగా హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు గొప్ప సేవలు అందించారని కొనియాడారు. వాళ్ల సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు.