Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన పాసింజర్ వాహనాల్లో మార్పులు చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 ఫేజ్-2గా పేర్కొనే ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్లలో మార్పులు చేపట్టింది. అలాగే 20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) నడిచే విధంగా వాహన శ్రేణిని తీర్చిదిద్దినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఉద్గార ప్రమాణాలతో పాటు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహన శ్రేణిలో కొత్త ఫీచర్లను జోడించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. భద్రత, మెరుగైన సౌకర్యాలతో ప్రయాణానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లు పేర్కొంది. తక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలైన అల్ట్రోజ్, పంచ్ మోడళ్లలో తక్కువ గేర్లలో వెళుతున్నప్పుడూ కుదుపుల్లేని ప్రయాణ అనుభూతి లభిస్తుందని తెలిపింది. అలాగే, ఈ రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్లలోనూ ఐడిల్ స్టాప్, స్టార్ట్‌ను అందిస్తున్నామని, దీనివల్ల మెరుగైన మైలేజీ వస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. ఇక డీజిల్ ఇంజిన్ కార్లు అయిన అల్ట్రోజ్, నెక్సాన్‌లో రెవోటార్క్ డీజిల్ ఇంజిన్లను తీసుకొచ్చినట్లు టాటా మోటార్స్ తెలిపింది. మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించేందుకు వీలుగా నెక్సాన్ డీజిల్ ఇంజిన్‌లో మార్పులు చేసినట్లు పేర్కొంది. తమ వాహన శ్రేణికి అందిస్తున్న స్టాండర్డ్ వారెంటీని సైతం 2 ఏళ్లు/ 75 వేల కిలోమీటర్ల నుంచి 3 ఏళ్లు/ 1 లక్ష కిలోమీటర్లకు పెంచుతున్నట్లు తెలిపింది. వాహన శ్రేణిలో చేపట్టిన మార్పుల పట్ల వినియోగదారులు సంతృప్తి చెందుతారని, తమ మార్కెట్ వాటా మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు.