Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీశైలం
ప్రఖ్యాతిగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగం.. అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం సాంప్రదాయబద్దంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో ఆలయ ప్రవేశం చేసి యాగశాలలో గణపతిపూజ మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు జరిపించారు. లోకకళ్యాణాన్ని కాంక్షస్తూ శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
మహాశివరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మొదటగా గణపతి పూజ, పుణ్య వాచనం, చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణ ధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీప స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం ప్రధాన కళశ స్థాపన కార్యక్రమాలు జరిపించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా చేశారు. ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనమైన నందీశ్వరుని ప్రతిమ, అష్టమంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై పతాకావిష్కరణగా నూలు తాడుతో పైకి ఎగురవేసేందుకు సిద్ధం చేసి ఉరేగింపు నిర్వహించి చండీశ్వరస్వామి సమక్షంలో ప్రత్యేక పూజాధికాలు చేశారు. అనంతరం భేరిపూజ చేసి మేళతాళాల రాగాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీ అని ప్రధాన అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చే యక్ష గంధర్వ గణాలకు ఆలయ ప్రాంగణంలో నిర్ణీత స్థలాలు కేటాయించి నిత్యోత్సవ పూజలు జరిపించుతారని స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.