Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆ దంపతులకు ఏడాది కిందటే పెళ్లయ్యింది. తొలి వివాహ వార్షికోత్సవం ఆనందంగా జరుపుకొని.. ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రగాయాలపాలయ్యారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన ఊట్ల శ్రీకాంత్(25)కు ఏడాది కిందట పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన అర్చనతో వివాహమైంది. శుక్రవారం వీరి పెళ్లిరోజు కావడంతో ఇస్నాపూర్‌లో వేడుక చేసుకుని శనివారం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు. దౌల్తాబాద్‌లో లారీ వీరిని వెనక నుంచి ఢీకొట్టింది. లారీ వెనుక చక్రం కిందపడిన అర్చనను కొద్దిదూరం ఈడ్చుకుపోవడంతో నడుము భాగం ఛిద్రమైంది. శ్రీకాంత్ లారీ యాక్సిల్ వద్ద ఇరుక్కుపోయారు. పోలీసులు స్థానికుల సాయంతో భార్యాభర్తలను బయటకు తీశారు. పోలీసులు తమ వాహనంలో వారిని తొలుత నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అర్చన పరిస్థితి విషమంగా ఉంది.శ్రీకాంత్ తలకు హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది.