Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదారాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె లో మునిగే ఎల్లయ్య తన పశువుల కొట్టెంలో కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపివేసింది. ఉదయం పశువు కొట్టంకు వెళ్లి చూడగా దూడ మరణించి ఉండడాన్ని గమనించి అధికారులకు సమాచారం అందజేశాడు. అక్కడి చేరుకున్న అటవి, పశు సంవర్ధక శాఖ అధికారులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించగా చిరుత పాద ముద్రలు గుర్తించారు. ఘటనతో గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు ఎవరూ కూడా సమీప అటవి ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. చిరుతను పట్టుకోవడానికి శాఖ పరమైన ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు.