Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎడిన్బర్గ్
విమానంలోని ఒక ఇంజిన్ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. విమానాన్ని దారి మళ్లించి సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. స్కాట్లాండ్ దేశంలో ఈ సంఘటన జరిగింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ కాగానే అసాధారణ శబ్దం వినిపించింది. దీనిని గ్రహించిన ఒక పైలట్ విమానం అంతా నడిచి బయటవైపు పరిశీలించారు. ఒక ఇంజిన్ నుంచి మంటలు రావడం చూశారు. దీంతో విమానాన్ని వెంటనే సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాలని పైలట్లు నిర్ణయించారు. స్కాట్లాండ్లోని ప్రెస్ట్‌విక్ నగరానికి విమానాన్ని మళ్లించారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు త్వరగా విమానం నుంచి దిగాలని సూచించారు. అప్పటికే ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే విమానం వద్దకు వచ్చారు. ఒక ఇంజిన్ నుంచి వస్తున్న మంటలను ఆర్పివేశారు.
కాగా, ఈ సంఘటనతో విమానంలోని ప్రయాణికులు కొంత గందరగోళానికి గురయ్యారు. విమానం దిగిన తర్వాత వారికి అసలు విషయం తెలిసింది. అయితే ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి డెల్టా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పంది. వారిని తిరిగి ఎడిన్‌బర్గ్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి గమ్యస్థానానికి చేర్చుతామని తెలిపింది. మరోవైపు విమానం గాల్లో ఉండగా ఇంజిన్ నుంచి మంటలు వస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.