Authorization
Tue April 29, 2025 12:33:49 pm
నవతెలంగాణ - ఖమ్మం
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’, అమెరికా విద్యార్థులకు నిర్వహించిన ‘నాసా టెక్ రైస్ చాలెంజ్’ పోటీల్లో ఖమ్మం నగరానికి చెందిన కావ్యరచన సత్తాచాటింది. డల్లాస్లోని హోప్ డే పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న కావ్యరచన, తన జట్టు సభ్యులతో కలిసి వ్యోమగాములకు ఆహారం కోసం అంతరిక్షంలో మొక్కలను పెంచేందుకు ఉపయోగపడే గ్రీన్హౌస్ను రూపొందించింది. ఈ పోటీల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి కొన్ని వందల జట్లు పాల్గొన్నాయి. అంతరిక్షంలోని రేడియేషన్, ఉష్ణోగ్రతల ప్రభావం గ్రీన్హౌస్లోని విత్తనాలపై ఎలా ఉంటుంది? గ్రీన్హౌస్ ద్వారా అంతరిక్షంలో ఆహార పంటల ఉత్పత్తి అనే అంశంపై కావ్వరచన బృంద సభ్యులు చేసిన అధ్యయనానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీనికిగాను కావ్యరచన జట్టుకు నగదు బహుమానం దక్కింది. ఖమ్మం నగరానికి చెందిన చావా కృష్ణచైతన్య, మాధవి దంపతులు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. వారి కుమార్తె కావ్యరచన తన పరిశోధన ద్వారా ఖమ్మం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినందుకు నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు.