Authorization
Wed April 30, 2025 12:20:51 am
నవతెలంగాణ - పాకిస్థాన్
పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే లీటరు పాలు రూ. 210, కేజీ చికెన్ రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 22.02, రూ. 17.20 పెరిగాయి. ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత పెట్రోల్ ధర రూ. 272, డీజిల్ ధర రూ. 280. వీటితో పాటు కిరోసిన్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో కూడా వీటి ధరలను పెంచింది.
భారతదేశం వంటి కొన్ని దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి నిలకడగా ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో చమురు ధరలు ఎప్పుడో సెంచరీ దాటాయి. పాకిస్థాన్ కరెన్సీలో భారీగా తగ్గుదల, చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల పాకిస్థాన్లో గత కొన్ని రోజులుగా చమురు ధరలు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి కొట్టు మిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలు రానున్న రోజుల్లో మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలతో పాటు ఇంధన ధరలు కూడా పెరగటం వారికి శాపంగా మారింది. ఇప్పటికీ కొంత మంది ప్రజలు ఆకలి బాధలను భరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంతోమందిని కలచి వేస్తున్నాయి.