Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గాంధీనగర్
గతేడాది గుజరాత్ లోని మోర్బీ నగరంలో వేలాడే వంతెన కూలి 135 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల సిట్ నివేదికను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవలే మోర్బీ మున్సిపాలిటీకి అందజేసింది.
దీనిలో వంతెన ప్రధాన కేబుళ్లు ఏడు ఉప తీగలు, అందులో ప్రతి తీగ మళ్లీ ఏడు ఉక్కువైర్లను కలిగి ఉన్నాయి. ఇలా మొత్తం 49 వైర్లతో కేబుల్‌ను రూపొందించారు. అయితే, తెగిపోయిన కేబుల్‌లో 22 వైర్లు అప్పటికే తుప్పు పట్టాయి. ప్రమాదానికి ముందే అవి తెగిపోయినట్లు తెలుస్తోంది. మిగితావి ప్రమాద సమయంలో ధ్వంసమయ్యాయి అని సిట్ తన నివేదికలో తెలిపింది. వంతెన పునరుద్ధరణ పనుల్లో భాగంగా పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేశారని, ఇదీ ప్రమాదానికి ఓ కారణమని తేల్చింది. ఈ రకమైన వంతెనల్లో ఒకటే సస్పెండర్ను వినియోగిస్తారని తెలిపింది.
అంతే కాకుండా సిట్ నివేదిక ప్రకారం కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది వంతెన సామర్థ్యం కంటే చాలా ఎక్కువని పేర్కొంది. పైగా ప్లాట్‌ఫాంపై ఉన్న చెక్క పలకలను అల్యూమినియం ప్యానెళ్లతో మార్చడం కూడా ప్రమాదానికి ఓ కారణమని తెలిపింది. ఆ ప్యానెళ్ల కారణంగా వంతెన బరువు పెరిగిందని చెప్పింది. చెక్క పలకలు ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని, వంతెన పునః ప్రారంభానికి ముందు నిర్మాణ, సామర్థ్య పరీక్షలు చేయలేదని ప్రస్తావించింది.