Authorization
Wed April 30, 2025 01:48:16 pm
నవతెలంగాణ-గన్నవరం : హైదరాబాద్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులపై స్పందించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలులేదని స్పష్టం చేశారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరు ప్రవేశించకుండా చెక్‌పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా గన్నవరంలోకి ప్రవేశించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఎస్పీ జాషువా కోరారు. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని ఎస్పీ అన్నారు. సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి టీడీపీ నేత పట్టాభి పురిగొల్పారని, బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం వల్లే శాంతిభద్రతల సమస్య వచ్చిందని చెప్పారు. గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని తెలిపారు. పట్టాభి తొందర పాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించారు.