Authorization
Wed April 30, 2025 03:15:59 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో వీధి కుక్కల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంబర్పేటలో జరిగిన ఘటన బాధకరమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందనడం సరికాదని తెలిపారు. 30 సర్కిళ్లలో కుక్కలను పట్టుకునేందుకు 30 బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంబర్పేట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ తరుఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడంపై సమావేశంలో సలహా వచ్చిందని వివరించారు. ఒక్కో వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడానికి దృష్టిని సారిస్తున్నామని, నెలకు ఆరు వందల కుక్కలను దత్తత తీసుకుని వాటికి ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేశామని వెల్లడించారు. నగరంలో 160 స్టెరిలైజేషన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని వివరించారు. స్టెరిలైజేషన్ తర్వాత యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇస్తున్నామని మేయర్ వెల్లడించారు. వీధి కుక్కల కట్టడికి ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తామని అన్నారు. హైదరాబాద్ పరిధిలో 5.70లక్షల వీధి కుక్కలున్నట్లు అంచనా వేశామని తెలిపారు. వీధి కుక్కల విషయమై అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ సమావేశానికి వెటర్నరీశాఖ, జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.