Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేసీఆర్ కు తెలుగు భాషపై ఉన్న ప్రేమతోనే సాహిత్య అకాడమిని పునరుద్ధరించారని, తెలుగు భాషా పరిరక్షణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తెలుగు భాషా సంపూర్ణ అమలుకు తెలంగాణా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో మంగళవారం కవులు, రచయితల సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మాతృభాషా పరిరక్షణలో భాగంగా అకాడమీ ఆధ్వర్యంలో "మన ఊరు - మన చెట్లు" అన్న కథల పోటీలు నిర్వహిస్తే అందులో ఐదు లక్షల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థుల మాతృభాష తెలుగు పరిరక్షణ కోసం అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాతృభాష పరిరక్షణలో భాగంగా మన సాహిత్య, సంస్కృతిక సౌరభాలు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విరజిల్లుతున్నాయో "మన ఊరు - మన చరిత్ర" ద్వారా విద్యార్థులు పదిల పరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగు భాష అమలు పకడ్బందీగా జరుగుతుందని, పాఠశాల స్థాయి నుంచే ఆ పునాదులు బలంగా పడుతున్నాయని జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ మాతృభాషను బతికించుకునే పని మన ఇంటి నుంచే మొదలు కావాలని అన్నారు. తెలుగు మాధ్యమంలో ఉన్న టివి ఛానల్ లలో సులభమైన తెలుగు పదాలను వాడాలన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు సమాజంలోని ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషకు పరిపూర్ణమైన తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి భాషాభిమాని అని, ఆయన ఆధ్వర్యంలో మనందరం ముందుకు వెళ్లాలన్నారు. ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు భాషపై ప్రేమతోనే తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టారని, దాన్ని తప్పనిసరి బోధనగా చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా సాహితీ సంస్థ కార్యదర్శి కే. ఆనందాచారి మాట్లాడుతూ మాతృభాషా క్షీణించడానికి కారణాలు అన్వేషించకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదని, మనం మనుషులుగా బతికితేనే భాష కూడా సజీవంగా ఉంటుందన్నారు. ప్రపంచీకరణలో మనిషి అన్నింటిని వదిలేసుకుంటున్నాడని, భాషను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కృషి చేయాలన్నారు. భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భాషా అస్తిత్వం బంగ్లాదేశ్ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాయన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఎన్. బాలాచారి, ప్రముఖ కవయిత్రి జ్వలిత, సలీమా, ప్రముఖ రచయితలు రూప్ కుమార్ డబ్బికార్, కందుకూరి శ్రీరాములు, చీకోలు సుందరయ్య, తంగిరాల చక్రవర్తి, షెహనాజ్ భేగం, ఎం. నారాయణ శర్మ, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కేపి అశోక్ కుమార్, అనంతోజు మోహనకృష్ణ, షెహబాజ్, శరత్ సుదర్శి, ఎం. రేఖ తదితరులు పాల్గొన్నారు.