Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియ్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల కోసం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో హైపవర్ కమిటీలను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణ బాధ్యత ఈ కమిటీలదేనని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులతో సమన్వయము చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నిఘా ఉంచేందుకు పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు చెప్పారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు ప్రతీ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. సమావేశంలో అధికారులు నవీన్ మిట్టల్, వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.