Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ రెండు కుటుంబాలది. వృద్ధ వయసులోనూ తాపీ పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్న ఆ అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తోడబుట్టిన అన్నదమ్ముళ్లిద్దరూ ప్లాస్టరింగ్ పనులు చేస్తూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన అన్నదమ్ముళ్లు గొనుగొప్పుల రాములు(67), గొనుగొప్పుల లింగన్న(65) మేస్త్రీ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే మంగళవారం రోజు ఓ పాత ఇంటి గోడకు ప్లాస్టరింగ్ పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో పాత గోడ ప్రమాదవశాత్తు కూలిపోయింది. రాములు, లింగన్న మీద గోడ కూలడంతో తీవ్రంగా గాయపడ్డారు. రాములు అక్కడికక్కడే మృతి చెందగా, లింగన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తోడబుట్టిన అన్నదమ్ముళ్లిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.