Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఝార్ఖండ్ రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో ఓ ఏనుగు పన్నెండు రోజుల వ్యవధిలో 16 మందిని హతమార్చింది. ఇందులో ఒక్క రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపడంతో ఇటకీ బ్లాకులో అయిదుగురిని మించి జనం గుమికూడకుండా అధికారులు 144 సెక్షన్ విధించారు. మరిన్ని దుర్ఘటనలు జరగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు మంగళవారం రాంచీ డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో బయటకు రావద్దని.. ఏనుగుకు దగ్గరగా ఎవరూ వెళ్లవద్దంటూ ఇటకీ బ్లాకు గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. హజారీబాగ్, రామ్‌గఢ్, చతరా, లోహర్దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపిన ఏనుగును అడవుల్లోకి తరలించేందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్రం బాంకుడా జిల్లా నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ సామంతా తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఝార్ఖండ్‌లో మనుషులపై ఏనుగుల దాడులు గత కొన్నేళ్లుగా పెరిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2017 నుంచి అయిదేళ్లలో 462 మంది ఏనుగుల దాడుల్లో మరణించారు.