Authorization
Tue April 29, 2025 06:01:17 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొబ్బరి బొండాల మాటున గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఉప సర్పంచ్‌తో సహా నలుగురి ముఠాను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 170 కిలోల గంజాయి, కారు, బొలెరో, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీపీ పీ కరుణాకర్ నిందితులను అరెస్ట్ వివరాలు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన రాయినేని శంకర్, హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఉపసర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన మాట మహేశ్, ములుగు జిల్లా పస్రాకు చెందిన గండికోట సతీశ్, ఆంధ్రప్రదేశ్‌లో నర్సీపట్నం నూకరాజుతో కలిసి 170 కిలోల గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. రెండు కిలోల ప్యాకెట్లు చొప్పున బొలెరో వాహనంలో అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్య రహస్యంగా భద్రపరిచి, బొలెరో వాహనం ముందు శంకర్, లక్ష్మణ్ మరో కారులో ఎస్కార్ట్‌గా వరంగల్‌కు వస్తున్నక్రమంలో పక్కసమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా ఆత్మకూరు శివారులో తనఖీలు నిర్వహిస్తున్నక్రమంలో పట్టుబడ్డారు. ఈముఠాను పట్టుకోవడంలో ప్రతిభచూపిన పరకాల ఏసీపీ శివరామయ్య, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు కే శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్లు, ఆత్మకూరు ఇన్స్పెక్టర్ బీ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై లవన్‌కుమార్ తదితరులను ఆయన అభినందించారు.