Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జార్ఖండ్
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. బొకారో జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిచెందడంతో కోళ్లు, బాతులతో సహా దాదాపు 4 వేల పక్షులను చంపేయాలని పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ శనివారం అర్థరాత్రి ప్రారంభమైంది. ప్రభుత్వ ఫౌల్ట్రీ ఫామ్‌లో ఈ నెల 2 నుంచి కోళ్లు చనిపోతున్నాయి. దీనికి గల కారణాలను పరిశీలించగా బర్డ్ ఫ్లూ అని పిలుచుకునే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ రకానికి చెందిన హెచ్5ఎన్1గా గుర్తించామని, దీనికారణంగా పక్షులు మరణిస్తున్నాయని నిర్ధారించామని అధికారులు వెల్లడించారు. ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్‌నాథ్ కోళ్లలో ఈ వైరస్‌ను గుర్తించామని, దీనికారణంగా లోహంచల్‌లోని ఫామ్‌లో ఉన్న 800 కడక్ నాథ్ కోళ్లు చనిపోయాయని, మరో 103 కోళ్లను చంపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో లోహంచల్ ఫామ్‌కు కిలోమీటర్ పరిధిలో ఉన్న 3,856 కోళ్లు, బాతులను చంపేయాలని నిర్ణయించామని రాంచీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ డైరెక్టర్ డాక్టర్ బిపిన్ బిహారీ మహ్తా చెప్పారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఆదివారం కూడా కొనసాగుతుందని వెల్లడించారు.