Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తొర్రూరు
తొర్రూరు మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులతో అభివృద్ధి చెందిన డివిజన్ల కు కాస్త తక్కువ, తక్కువ అభివృద్ధి జరిగిన డివిజన్ల కు కాస్త ఎక్కువ నిధులు కేటాయించాలని అధికారులకు సూచించారు.
మంగళవారం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులు , ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే తొర్రూరు పట్టణానికి వచ్చే అవకాశముందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తొర్రూరు ను మున్సిపాలిటీ చేశాక అనేక రకాల నిధులతో పట్టణ రూపు రేఖలను మార్చామని, పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇప్పటికే అనేక రకాలుగా వచ్చిన నిధులను తొర్రూరు పట్టణ అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జీనుగ సురేందర్ రెడ్డి, కమిషనర్ బిందు శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.