Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. తాజాగా, తెలంగాణ విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డుస్థాయిలో మంగళవారం నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా 14,750 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో ఫిబ్రవరి 11, శనివారం 14,649 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇంతకుముందు వ్యవసాయానికి 35 శాతం మాత్రమే విద్యుత్ వినియోగించేవారని కానీ, ఇప్పుడు అది 37 శాతానికి పెరిగిందని అధికారులు అన్నారు.
ఈ తరుణంలో విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువగా బోరుబావులపై ఆధారపడే వ్యవసాయ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారుల అంచనా. డిమాండ్ ఎంత వచ్చిన 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.