Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఢిల్లీ: జీ20 అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం, చైనా బెలూన్ ఘటన.. భారత్ నిర్వహిస్తోన్న ఈ సమావేశ ఉద్దేశాన్ని మరుగునపడేలా చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని మన దేశం భావిస్తోంది. కానీ ఉక్రెయిన్ అంశమే ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది.
ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని పాశ్చాత్య దేశాలు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. యూఎస్, దాని మిత్రదేశాల విధ్వంసక విధానాల వల్ల ఈ ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉంచింది. వాటి తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టింది. పేద దేశాల కష్టాలను మరింత తీవ్రం చేసింది’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఉక్రెయిన్ సంక్షోభంతో బాలిలో జరిగిన జీ20 సదస్సు నుంచి వారిద్దరు ఒకే దగ్గర కూర్చున్న సందర్భాలు లేవు. బాలి సదస్సు నుంచి లావ్రోవ్ బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మరోపక్క నిఘా బెలూన్ ఘటన నేపథ్యంలో బ్లింకెన్, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ కూర్చొని మాట్లాడుకోవడమూ అనుమానంగానే ఉంది. ఈ బెలూన్ ఘటన వల్లే బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది. అలాగే చైనా దౌత్యవేత్తకు ఆయన గట్టి హెచ్చరికలు చేశారు. బుధవారం సాయంత్రం నుంచి విదేశాంగమంత్రుల సమావేశాలు ప్రారంభవుతుండగా.. ప్రధాన చర్చలన్నీ గురువారం జరుగుతాయి. చైనా విషయంలో పాశ్చాత్య దేశాల మద్దతు కోరుకుంటున్న భారత్.. రష్యా నుంచి మాత్రం చమురు దిగుమతులను పెంచింది. ఈ పరిణామాల మధ్య జరుగుతోన్న సమావేశాలు మనదేశానికి సవాలనే చెప్పాలి.