Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి సాత్విక్ (16) ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిటీ.. రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడించింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో అతనికి అడ్మిషన్ లేదని పేర్కొంది. ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకుని మరో కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారని నివేదికలో వెల్లడించింది. అడ్మిషన్ సమయంలో నార్సింగ్ కళాశాల పేరుతోనే తమకు రశీదు కూడా ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని సాత్విక్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కళాశాలలో ఉపాధ్యాయుల వేధింపులు, హింస, అవమానం భరించలేక తరగతి గదిలో ఉరి వేసుకుని తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని రాజప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, సూసైడ్ నోట్ ఆధారంగా శ్రీచైతన్య కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ అకలంకం నర్సింహాచారి అలియాస్ ఆచారి, ప్రిన్సిపల్ తియ్యగురు శివ రామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ కందరబోయిన నరేశ్, వైస్ ప్రిన్సిపల్ ఒంటెల శోభన్బాబులను అరెస్టు చేసి రాజేంద్రనగర్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆయన ఆదేశాల మేరకు నలుగురినీ చర్లపల్లి జైలుకు తరలించారు.