Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అత్యవసరమంటూ హడావుడి చేసి అర్ధరాత్రి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్న ముగ్గురు యువకులు డబ్బులు అడిగిన కార్మికులపై విరుచుకుపడి ఒకరి ప్రాణాలను బలిగొన్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని మిర్జాగూడ హెచ్‌పీ పెట్రోల్ బంకులో సోమవారం అర్ధరాత్రి జన్వాడ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మల్లేశ్, నరేందర్, అనూఫ్లు కారులో వచ్చి అత్యవసరంగా దూరం వెళ్లాలంటూ డ్యూటీలో ఉన్న కార్మికులు పడుకోవడంతో వారిని నిద్రలేపి పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం డబ్బులు ఇచ్చే క్రమంలో ఆన్లైన్ చేస్తామని మల్లేశ్ చెప్పగా.. తమ వద్ద ఆన్లైన్ సదుపాయం లేదని డబ్బులు ఇవ్వాలని కార్మికుడు సంజయ్ అన్నాడు. డబ్బులు లేవని.. కార్డు స్వైప్ చేసుకోవాలని లేదంటే మీ ఇష్టం అని హెచ్చరించారు. దీంతో అక్కడే నిద్రిస్తున్న కార్మికులకు, ముగ్గురు నిందితులకు మధ్య చిన్న పాటి వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో కార్మికుడు సంజయ్‌పై మల్లేశ్, నరేందర్, అనూఫ్లు విచక్షణా రహితంగా దాడిచేయడంతో పాటు తలపై బలంగా కొట్టారు. దీంతో సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. అనంతరం తోటి కార్మికులు డయల్ 100కు ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడు సంజయ్‌ని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితులు మల్లేశ్, నరేందర్, అనూఫ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబ సభ్యులు, ప్రొద్దటూరు గ్రామస్తులు మంగళవారం జన్వాడ ప్రధాన చౌరస్తాలో ఆందోళనకు దిగారు