Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బాలికలను విద్యకు దూరం చేయాలన్న లక్ష్యంతో ఇరాన్లో ఇటీవల వందలాదిమంది బాలికలపై మత ఛాందసవాదులు విష ప్రయోగం చేశారు. ఫలితంగా వారంతా ఆసుపత్రుల పాలయ్యారు. మూడు నెలలుగా దాదాపు 1000 మందికి పైగా బాలికలపై విష ప్రయోగం జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వరుస ఘటనలపై తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నేరాలను క్షమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ చర్యలకు పాల్పడిన వారికి మరణశిక్ష ఖాయమని హెచ్చరించారు. తాజాగా ఆయన జాతీయ టీవీ చానల్లో మాట్లాడుతూ.. విష ప్రయోగ ఘటనలపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని తేలితే దోషులను క్షమించవద్దని, వారికి మరణదండన విధించాలని ఆదేశించారు. కాగా, మూడు నెలల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయతొల్లా స్పందించి ఈ హెచ్చరిక జారీ చేశారు. కాగా, అధికారుల దర్యాప్తులో అనుమానాస్పద నమూనాలను సేకరించామని, ప్రజలు సంయమనం పాటించాలని ఇరాన్ అంతర్గత మంత్రి అహ్మద్ వాహిద్ కోరారు.