Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో అమెరికా సహా ఇతర కేంద్ర బ్యాంకులు మరోసారి వడ్డీ రేట్లు పెంచుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రధాన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 17,600 స్థాయి దిగువన ముగిసింది. దీంతో మూడు రోజుల లాభాలకు తెరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.02గా ఉంది.
ఉదయం 60,467 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లో జారుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల వెల్లువెత్తడంతో మరింత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 541.81 పాయింట్ల నష్టంతో 59,806.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 164.80 పాయింట్ల నష్టంతో 17,589.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా.. మెటల్, పవర్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.