Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం తస్కరణకు గురైనట్లు కమిషన్ గుర్తించింది. దీంతో ఈ నెల 12న నిర్వహించాల్సిన సదరు రాత పరీక్షను వాయిదా వేసినట్లు శనివారం ప్రకటించింది. పరీక్ష వాయిదాపై అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.
ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షను సైతం వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. టౌన్‌ప్లానింగ్ పోస్టులకు ఈ నెల 12న ఓఎంఆర్ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేసింది. ఈ తరుణంలో పరీక్షకు ఒకరోజు ముందు టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నుంచి సమాచారం హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై అత్యవసర సమావేశం నిర్వహించిన కమిషన్ టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ల నుంచి పరీక్షకు సంబంధించిన సాఫ్ట్ కాపీ సమాచారం హ్యాకింగ్‌కు గురైందని, ప్రశ్నల వివరాలు అభ్యర్థులకు చేరలేదని అభిప్రాయం వ్యక్తంచేసింది.