Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: ప్రతి ఎన్నిక తమకు అగ్నిపరీక్షేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. గత 70 ఏండ్ల కాలంలో ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నది. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో కర్ణాటకలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారా..? అన్న మీడియా ప్రశ్నకు సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. తమకు ప్రతి ఎన్నిక అగ్నిపరీక్షేనని చెప్పారు. అయినా గత 70 ఏండ్లుగా ఎన్నో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇటీవల జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి మొత్తం 400 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు, 16 సార్లు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా ఫలితాలు అందరి ఆమోదం పొందాయని, ఒకరి నుంచి ఒకరికి శాంతియుతంగా అధికార మార్పిడి జరిగిందని చెప్పారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24 వరకు ఉన్నది. అంటే ఆలోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.