Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని పుణె పట్టణంలో ఘోరం జరిగింది. డ్రైనేజీ శుభ్రం చేసే ప్రయత్నంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పుణెలోని బారామతి ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రం విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే బారామతి ఏరియాలోని ఓ వీధిలో డ్రైనేజీ నిండిపోయి మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దాంతో స్థానికులు మోటార్ ద్వారా మురుగు నీటిని బయటికి తోడేసి శుభ్రం చేసే పనిలో పడ్డారు. అయితే కాసేపటికి మోటార్ పైపులో మురుగు తట్టడంతో ప్రవీణ్ అతోలే అనే వ్యక్తి ఆ పైపును క్లీన్ చేసేందుకు డ్రైనేజీలోకి దిగాడు. ఆ వెంటనే ఊపిరాడక లోపల పడిపోయాడు. దాంతో అతని తండ్రి.. కొడుకును కాపాడేందుకు డ్రైనేజీలో దిగి అతను కూడా ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత వాళ్లను కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా డ్రైనేజీలో దిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైనేజీ చాలా రోజులుగా మూసి ఉండటంతో విషవాయువులు నిండాయని, అందుకే ఒకరి తర్వాత ఒకరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.