Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో సెంచరీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 75 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. వీటిలో వన్డేల్లో 46, టెస్టుల్లో 28, ఒక టీ20 సెంచరీ ఉంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న వంద శతకాల రికార్డును కోహ్లీ అందుకుంటాడా..? లేదా..? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఇలాగే ఓ మూడేళ్లపాటు విరాట్ తన ఫామ్‌ను కొనసాగిస్తే కష్టమేం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశాడు. విరాట్ ఏకంగా 110 సెంచరీలను కొట్టేస్తాడని వ్యాఖ్యానించాడు. ‘‘విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. అయితే ఇదేమీ కొత్త కాదు. కానీ, కెప్టెన్సీ ఒత్తిడితో గతంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మానసికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నాడు. తప్పకుండా మరింత ఫోకస్‌తో క్రికెట్ ఆడతాడు. అందుకే, సచిన్ రికార్డును అధిగమించడమే కాకుండా.. 110 సెంచరీలను కూడా విరాట్ సాధిస్తాడనే నమ్మకం నాకుంది. ఇక నుంచి బీస్ట్‌లా పరుగుల వేటలో దూసుకుపోతాడు’’ అని అక్తర్ తెలిపాడు.
తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సచిన్ తెందూల్కర్ వికెట్ తీయడమే తనకెంతో ఇష్టమైన సంఘటనగా అక్తర్ అభివర్ణించాడు. ‘‘సచిన్ తెందూల్కర్ వికెట్‌ను తీస్తానని ఓసారి మా జట్టు సభ్యులకు చెప్పా. అలా కోల్‌కతా వేదికగా జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌లో తొలి బంతికే సచిన్ వికెట్‌ను నా ఖాతాలో వేసుకున్నా. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఔట్ చేయడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. అయితే, సచిన్ ఔటైన తర్వాత స్టేడియం మొత్తం ఖాళీ కావడం నాకు ఇప్పటికీ గుర్తుంది’’ అని అక్తర్ గుర్తు చేసుకున్నాడు.