Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్‌కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, వివిధ శాఖల అధికారులతో కలిసి రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డ్ సీఈవో ఖాజా మైనోద్దిన్తో పాటు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శానిటేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగల నిర్వహణకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్‌కు ముస్లీం సోదరులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా రంజాన్‌కు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రంజాన్ నేపథ్యంలో నెల రోజులపాటు ఉపవాసదీక్షలు చేపడతారని తెలిపారు. మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, లైటింగ్ వంటి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆటంకాలు లేకుండా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కొన్ని మసీదుల వద్ద వీధి కుక్కల బెడద ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలను తరలించి సమస్యను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజు మసీదులలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారని, వ్యర్ధాలను వేసేందుకు ప్రత్యేక డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని, ఆ వ్యర్ధాలను తరలించే విధంగా పర్యవేక్షణ జరపాలని శానిటేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.