Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరవకముందే అదే రోజు రాత్రి(గురువారం) మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ‘కొపల్లె ఫార్మా కెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్’లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. కంపెనీలో 150 వరకు డ్రమ్ముల్లో మిథనాయిల్, ఇతర ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి ఒత్తిడి కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
పరిశ్రమకు ఆనుకొని మోది అపార్ట్మెంట్స్, ఎస్ఆర్ నాయక్ నగర్ కాలనీ ఉన్నాయి. పేలుళ్లతో భారీ శబ్ధాలు రావడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్లపై పరుగులు తీశారు. జీడిమెట్ల పోలీసులు సమీప ఫ్లాట్లలో నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. రాత్రి 11 గంటల వరకు మంటలు చెలరేగాయి. పరిశ్రమకు ఆనుకొని ఖాళీ మైదానంలో ఓ వ్యక్తి ఖరీదైన శునకాలను పెంచుతున్నాడు. అవీ అరుపులతో తల్లడిల్లాయి. నగరంలో తరచూ అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.