Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను టీడీపీ అధినేత చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫకీరప్పలతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎలాంటి పాసులు లేకుండా చొరబడి, టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్ధమయిందని ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులను ఆదేశించారు.